- చెరువులోకి వెళ్లి మునిగి ఇద్దరు మృతి
- సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం
కోనరావుపేట, వెలుగు : గొర్రెలను కడిగేందుకు చెరువుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూడికె లక్ష్మీరాజం (73), కుమ్మం రవి అలియాస్ మొండయ్య (54) గొర్రెలను కాస్తూ జీవిస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం గొర్రెలను తీసుకొని గ్రామ సమీపంలోని ఊర చెరువు వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత గొర్రెలను కడిగేందుకు చెరువులోకి దిగారు.
ఈ క్రమంలో చెరువు లోపలికి వెళ్లిన లక్ష్మీరాజం నీటిలో మునిగిపోయాడు. గమనించిన రవి లక్ష్మీరాజంను కాపాడేందుకు వెళ్లాడు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో మరో కాపరి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని స్థానిక మత్స్యకారుల సాయంతో గాలించగా.. ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
